Thursday, 30 September 2021

88 సాయి పల్లకి

 


చూడరండి చక్కని మా సాయి పల్లకి

అది గంధ పరిమళాల పూలపల్లకి

 

ఎక్కినారు మా సాయి పూలపల్లకి 

అది పూల పూత పూసిన భక్తి పల్లకి


ఎత్తరండి మా సాయి భక్తి పల్లకి

అది భక్తి రేణువులద్దిన ప్రేమ పల్లకి


తిప్పరండి మా సాయి ప్రేమ పల్లకి

అది ఈ హృది నుండి ఆ హృదిలోనికి


తిప్పరండి మా సాయి హృది పల్లకి

అది ఈ భువి నుండి ఆ దివి లోనికి


చూడరండి మా సాయి చిరునవ్వుల పల్లకి

అది నవ్వులద్దిన ఆనందాల పల్లకి


చూడరండి చక్కని మా సాయి పల్లకి

అది ప్రేమ వాసనలద్దిన పూల పల్లకి 


పెట్టరండి గోరుముద్దల్ని మా చిన్ని సాయికి

తీయరండి దిష్టిని మా చక్కని సాయికి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ




Thursday, 16 September 2021

87 సాయి బాలసాయి

 

సాయీ...


తొలి సంధ్య వేళ బాల భానుని కాంతి నీది

మలి సంధ్య వేళ బాల చంద్రుని వెన్నెల నీది


తొలి పూజలందుకొనే బాల గణేశుని తత్వం నీది

అన్ని వేళలా కాపాడే బాలమురుగన్ మనసు నీది


పగటి వేళ  బాలరాముని తేజము నీది

రాత్రివేళ బాలకృష్ణుని అందము నీది


సర్వవేళలా బాల త్రిపురసుందరి శక్తి నీది

ఆర్తితో పిలిచిన వేళ బాల హనుమ రక్షణ నీది


సర్వకాల సర్వావస్థల యందు శరణాగతి చేసిన వారికి

సాయమందించే మా ముద్దుల బాలసాయివి నువ్వు


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Tuesday, 14 September 2021

86 సాయి దివ్య పాదము


సాయీ... 

వెతలను తీర్చే మహిమాన్వితమైన

నీ దివ్య పాదాలను నన్ను అంటనివ్వు


ఎద మాటున దాగిన వ్యధలన్నింటినీ కధలుగా 

నీ పాదాలకు చెప్పుకోనివ్వు


ఆనకట్ట కట్టి ఆపిన కన్నీళ్లను బయటకు తీసి 

నీ పాదాలను కడగనివ్వు


మధురాతి మధురమైన నీ పదముల అమృతాన్ని

ప్రియమారా తాగనివ్వు 


పరమ పవిత్రమైన నీ పాద ధూళిలో 

నన్ను మైమరచి ఆటలాడనివ్వు 


జ్ఞాన గంధముతో విరాజిల్లు నీ పాద పుష్పముల

మకరందాన్ని నన్ను మనసారా  గ్రోలనివ్వు


ఓం శ్రీ సాయిరాం 

🙏🙏🙏

-తేజ

85 సాయి వందనం

 

సాయీ...

ఇక్కడ కాదు, అక్కడ కాదు ఎన్నెన్ని మందిరాల్లో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఒకటి కాదు, రెండు కాదు ఎన్నెన్ని చిత్రపటాలలో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఇందు కాదు, అందు కాదు ఎందెందు విగ్రహాలలో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఒకటి కాదు, రెండు కాదు ఎన్నెన్ని ప్రాణుల్లో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


వీరు కాదు, వారు కాదు ఎవరెవరి హృదయాలలో 

నీవు కొలువై ఉన్నావో వారందరికీ నా వందనం


నా ఆత్మలో కాదు, అంతరాత్మలో కాదు నా అణువణువునా

కొలువై ఉన్న నీకు నా ప్రేమ పూర్వక వందనం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Wednesday, 1 September 2021

84 సాయి హృది

 


సాయి బంధువులారా!

మన హృది పీఠం పై  సాయిని గురువుగ నిలపుదాం...

వారే మన జీవితానికి మార్గదర్శకమై నిలిచేను


మన హృది సింహాసనంపై సాయిని మహరాజుగ నిలపుదాం...

వారే మన ఇంద్రియాలను ఓడించేను


మన హృది భాండాగారంలో సాయిని అక్షయపాత్రగా నిలపుదాం...

వారే మనకి ఎన్నటికీ తరగని సంపదగా నిలిచేను


మన హృది మంజూషంలో సాయిని అమూల్య రత్నంగా నిలపుదాం...

వారే మన తరతరాలకు వారసత్వంగా నిలిచేను


మన హృది గదిలో సాయిని వైద్యునిగా నిలపుదాం...

వారే మన ఆది వ్యాధులకు చికిత్స చేసేను


మన హృది మందిరంలో సాయిని దైవంగా నిలపుదాం...

ఎనలేని ప్రేమను వారి నుండే వరంగా పొందుదాం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...