Monday, 2 November 2020

59 సాయి రుణం

 


సాయీ...

దివ్వెనై నే నీ  చెంత నిలువంగ...

ప్రేమవై నువ్వు నా చెంత నిలిచేవు


ధూపమై నా శ్వాస నీ చెంత చేరంగ...

తోడువై నువ్వు నా చెంత నిలిచేవు


పుష్పమై నే నీ చెంత చేరంగ...

పున్నమివై నువ్వు వెలుగులు నింపేవు


శ్రద్ధ, సబూరినే నే నీపై నిలుపంగ...

కరుణాధారలనే నువ్వు నాపై కురిపించేవు


ఆర్తితో నే నీ చెంత నిలువంగ...

ఆప్యాయతతో నీవు నన్ను అక్కున చేర్చుకునేవు


ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను

జోడించిన నా ఈ కరములు తప్ప 

నిన్నే ఆరాధించే నా ఈ హృదయము తప్ప


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Thursday, 24 September 2020

58 సాయి పాద సన్నిధి

 


నీ నుదుటిని బాబా పాదములకు ఆనించి వేడు

నీ నుదిటి రాతను ఆయన ఇట్టే మార్చేను చూడు


నీ చేతులతో బాబా సేవ చేసి వేడు 

నీ చేతి గీతలను ఆయన ఇట్టే మార్చేను చూడు


నీ మనసుని బాబా పాదములకు అర్పించి వేడు

నిరంతరం నీ తోడుగా ఉండి ఆయనే నిన్ను నడిపిస్తారు చూడు


నీ నిశ్చల భక్తిని బాబా పాదముల చెంత పెట్టి వేడు

నీ కన్నీటిని ఆయన ప్రేమతో ఇట్టే తుడిచేస్తారు చూడు


నమ్మికతో బాబా పాదములను ఆశ్రయించి వేడు

నీ మనసులో ఆయన శాశ్వతంగా కొలువుండిపోతారు చూడు


ఓం శ్రీ సాయిరాం


🙏🙏🙏


-తేజSaturday, 19 September 2020

57 సాయి సర్వస్వం


బాబా...


నీ పరిచయం నాకు కాకుంటే లేదు నాకు ఉనికి 

నీ కరుణ నాపై లేకుంటే లేనే లేదు నాకు ఊపిరి


నీ స్మరణ నాకు లేకుంటే లేదు నాకు వర్తమానం

నీ స్ఫురణ నాకు లేకుంటే లేనే లేదు నాకు భవితవ్యం


నీ వీక్షణ నాపై లేకుంటే లేదు నాకు చైతన్యం

నీ రక్షణ నాకు లేకుంటే లేనే లేదు నాకు చలనం


నీ ప్రేమ నాపై లేకుంటే లేదు నాకు అస్తిత్వం

నీ దీవెన నాకు లేకుంటే లేనే లేదు నాకు ఆనందం


నీకై నాలో సహనం లేకుంటే లేదు నాకు జయం

నీపై నాకు నమ్మకం లేకుంటే లేనే లేదు నాకు జీవితం


ఓం శ్రీ సాయిరాం


🙏🙏🙏


-తేజ

Friday, 4 September 2020

56 సాయి స్మరణముసాయీ…

ఏ చోట నీ నామము పిలువబడుతున్నదో 

ఆ చోటు అయ్యేను షిరిడి పురము


ఏ చోట నీవు మా పాపములను దహించుతుంటివో

ఆ చోటు అయ్యేను ద్వారకము


ఏ చోట నీవు ఠీవీ గా కొలువుతీరి ఉంటివో 

ఆ చోటు అయ్యేను లెండీ వనము


ఏ నోట నీ నామము పలుక పడుతున్నదో 

వారి కర్మ అయ్యేను శూన్యము


ఏ హృది నిరంతరం నిన్నే స్మరించుతున్నదో 

వారి జన్మ అయ్యేను ధన్యము


ఓం శ్రీ సాయిరాం


🙏🙏🙏


-తేజ

Monday, 17 August 2020

55 సాయి ఊది

 


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

కళ్యాణ రామా రమ్ము రమ్ము 

సంచుల నిండా ఊదిని తే తెమ్ము


శ్రీసాయినాధా రమ్ము రమ్ము

కారుణ్య థామా రమ్ము రమ్ము

దోసిళ్ళ నిండా ఊదిని తే తెమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

నీ ప్రేమను పంచంగ వేగిరమే రమ్ము

నీ బిడ్డలనెల్లరిని కాపాడ రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

నీ ఊదిని మా నుదుట తీర్చిదిద్దంగ రమ్ము

నీ ఊది తోటి వ్యాధిని పారద్రోల రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

మా అజ్ఞాన తిమిరమును తొలగింప రమ్ము

జ్ఞాన జ్యోతులను వెలిగింప రా రమ్ము


శ్రీ సాయినాధా రమ్ము రమ్ము

సర్వ జీవులను రక్షింప రమ్ము రమ్ము

సకల జగములనేలంగ రా రమ్ము


శ్రీసాయినాధా రమ్ము రమ్ము

కారుణ్య థామా రమ్ము రమ్ము

దోసిళ్ళ నిండా ఊదిని తే తెమ్ము


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Saturday, 15 August 2020

54 సాయి ఆపన్నహస్తం


విడువము విడువము ఆ చేయిని

అడుగడుగున ఆదుకునే శ్రీ సాయిని

విడువము విడువము ఆ చేయిని

అండదండగ నిలిచే శ్రీ సాయిని


అన్నార్తులకు వండి వడ్డించిన చేయిని

దీనార్తులను దరి చేర్చుకున్న చేయిని

విడువము విడువము ఆ చేయిని


పశుపక్షులను ప్రేమతో లాలించిన చేయిని

పసిబిడ్డను మంటల నుండి తీసిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


బీదసాదలను ఆదుకున్న చేయిని

బాధలనెల్ల ఇట్టే తొలగించే చేయిని

విడువము విడువము ఆ చేయిని


ఊదిని నుదుటన దిద్దిన చేయిని

వ్యాధులను మాయం చేసిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


భక్తుల శిరముపై నిలిచిన చేయిని

దిక్కులను సైతం శాసించిన చేయిని

విడువము విడువము ఆ చేయిని


పంచభూతాలను అదుపు చేసిన చేయిని

పంచేంద్రియిలను వశ పరుచుకున్న చేయిని

విడువము విడువము ఆ చేయిని


విడువము విడువము ఆ చేయిని

అడుగడుగున ఆదుకునే శ్రీ సాయిని

విడువము విడువము నీ చేయిని

అండదండగ నిలిచే శ్రీ సాయిని


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


Friday, 14 August 2020

53 సాయి అపార కరుణ


బాబా...

ఎంతటి ఎంతటి కర్మము మాది 

అది ఎంతదైనా, దాన్ని తొలగించే నీ అపార ప్రేమ ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి కష్టము మాది 

అది ఎంతదైనా, దాన్ని తీసేసే నీ అపార కరుణ ముందు 

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి ఆవేదన మాది

అది ఎంతదైనా, దయ చూపే నీ హృది ముందు 

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి గర్వము మాది 

అది ఎంతదైనా, దాన్ని అణిచేటి నీ అపార ఘనత ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి కామ్యము మాది

అది ఎంతదైనా, దాన్ని ఈడేర్చే నీ అపార మహిమ ముందు

అది చాలా చిన్నది


ఎంతటి ఎంతటి దూరము నీకు మాకు మధ్య

అది ఎంతదైనా, నీ పట్ల మాలోని అపార భక్తి విశ్వాసములకు ఔతుంది అది చాలా చాలా చిన్నది


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ
Wednesday, 12 August 2020

52 సాయి పంకజంతలచితిని తలచితిని ఓ సాయీ 

తలచితిని నిన్నే నోయి 

తలచినంతనే ఓ సాయీ 

నా మది పులకరించెనోయి


ఉదయించే సూర్యుని లో ఓ సాయీ 

నీ తేజమును నే కంటినోయి

పున్నమీ చంద్రునిలో ఓ సాయీ

నీ రూపమును నే కంటినోయి


విరిసిన కుసుమమును చూసి ఓ సాయీ

పొంగేటి నీ ప్రేమను నే కంటినోయి

వెలిగేటి దివ్వెని చూసి ఓ సాయీ

కరుణించే నీ మనసుని నే కంటినోయి


వెన్నపూస ను చూసి ఓ సాయీ

నీ మెత్తాని మనసుని నే కంటినోయి

వెన్నెల ను చూసి ఓ సాయీ

నీ చల్లాని చూపుని నే కంటినోయి


పంకము ను చూసి ఓ సాయీ

నా మనసుని నే కంటినోయి

పంకమున విరిసిన పంకజమును చూసి ఓ సాయీ

నా మనసున సైతం నిలిచిన నిన్ను నే కంటినోయి


పద్మములను చూసి ఓ సాయీ

నీ పాద ద్వయమును నే కంటినోయి

భ్రమరముగా మార్చు నన్ను ఓ సాయీ

నీ పాద పద్మములను విడువక నే చుట్టెదనోయి


తలచితిని తలచితిని ఓ సాయీ 

తలచితిని నిన్నే నోయి 

తలచినంతనే ఓ సాయీ 

నా మది పులకరించెనోయి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Tuesday, 11 August 2020

51 సాయి దివ్య దర్శనంఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకు కలిగింది

కరుణామయుని ఈ దివ్యదర్శనం


ఇన్నాళ్లు, అన్నాళ్ళు అని ఎన్నాళ్లనుంచో 

వేచి చూసిన ఫలం ఈ దివ్యదర్శనం


ఎన్నెన్ని నా కన్నీళ్లనన్నింటిని 

ఇలా పన్నీరు చేసింది ఈ దివ్యదర్శనం


ఇన్నేళ్ల నా జీవితాన్ని ఇన్నాళ్లకు

ధన్యమును చేసింది ఈ దివ్య దర్శనం


ఎన్నెన్ని నా జన్మాల పుణ్యకర్మ ఫలమో

జన్మరాహిత్యాన్ని ఇచ్చేటి ఈ దివ్యదర్శనం


ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకైనా, మరి ఇంకెన్నాళ్లకైనా

మరువలేను ఈనాటి ఈ దివ్యదర్శనం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 10 August 2020

50 సాయీ రావయ్య

బాబా...

మా వేదనలో ఆవేదనని,

మా ఆవేదనలో వేదనని తొలగించ వేగిరమే రావయ్య


మా కష్టములలో కన్నీటిని, 

మా కన్నీటిని తెచ్చిన కష్టాలని తొలగించ వేగిరమే రావయ్య


మా ఆపదలలో బాధని,

మా బాధలకు కారణమైన ఆపదలని తొలగించ వేగిరమే రావయ్య


మా జన్మ జన్మల కర్మలను,

మా కర్మలు తెచ్చే ఈ జన్మజన్మలను తొలగించ వేగిరమే రావయ్య


చిత్రమైన మహమ్మారిని చూసి, చిగురుటాకులా వణుకుతున్న 

మమ్ము చేతలొడ్డి రక్షించ వేగిరమే రావయ్య 


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

59 సాయి రుణం

  సాయీ... దివ్వెనై నే నీ  చెంత నిలువంగ... ప్రేమవై నువ్వు నా చెంత నిలిచేవు ధూపమై నా శ్వాస నీ చెంత చేరంగ... తోడువై నువ్వు నా చెంత నిలిచేవు పుష...