Tuesday, 1 February 2022

93 సాయి సమస్తం

 



సాయి అంటే తల్లి,తండ్రి,గురువు

సాయి అంటే దైవం,మార్గం,స్నేహం

సాయి అంటే క్షమ,ప్రేమ,కరుణ

సాయి అంటే విద్య,శ్రద్ధ,సబూరి

సాయి అంటే ఊది,ఊపిరి,విజ్ఞానం

సాయి అంటే వేదం,నాదం,గ్రంథం

సాయి అంటే సృష్టి,స్థితి,లయ

సాయి అంటే శక్తి,యుక్తి,ముక్తి

సాయి అంటే మంత్రం,తంత్రం,యంత్రం

సాయి అంటే చిత్రం,చమత్కారం,నిత్యాగ్నిహొత్రం

సాయి అంటే దీవెన,లాలన,పాలన

సాయి అంటే సత్యం,నిత్యం,ఆణిముత్యం

సాయి అంటే ధనం,దానం,ధాన్యం

సాయి అంటే బలం,బంధం,భవిష్యత్తు

సాయి అంటే జగం,జలం,జీవం

సాయి అంటే జాతకం,జీవితం,జాగృతం

సాయి అంటే మౌనం,ధ్యానం,త్యాగం

సాయి అంటే విశ్వం,విశ్వాసం,ఆధారం

సాయి అంటే జవాబు,ఔషధం,పరిష్కారం

సాయి అంటే యుగం,యాగం,యోగం 

సాయి అంటే ధైర్యం,మాధుర్యం,ఔదార్యం

సాయి అంటే కణం,కాలం,కవనం

సాయి అంటే శాంతి,కాంతి,క్షాంతి

సాయి అంటే అద్భుతం,ఆనందం,అనంతం

సాయి అంటే విధి,నిధి,పెన్నిధి

సాయి అంటే స్వరం,వరం,అదృష్టం

సాయి అంటే గానం,గమ్యం,గమనం

సాయి అంటే అభయం,అనుభవం,ఆశ్వాసన

సాయి అంటే అణువు,పరమాణువు,సర్వం

సాయి అంటే ఆత్మ, మనసు, శరీరం

సాయి అంటే నువ్వు, నేను, మనం

 

సాయీ ఇందు కానిదేది నువ్వు?


ఇవి కొన్ని అచ్చులహల్లుల అల్లిక కాదు

నా ఉచ్ఛ్వాస నిశ్వాసల మాలిక

నీ ఉనికి, నా విశ్వాసాల కలయిక....అంతా సాయిమయం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ


92 సాయి ‌సత్యం


సాయీ...

నీ రూపునే నే చూచితి

నిన్నే నిరతము వేడితి


నీ పేరునే నే పలికితి

నిన్నే మదిలో నమ్మితి


నీ వెంటే నే నడిచితి

నిన్నే నిత్యము కొలిచితి


నీ దయనే నే వేడితి 

నిన్నే ఆర్తితో పిలిచితి


నీ ప్రేమనే నే కోరితి

నిన్నే మరువక తలిచితి


నీ అభయమునే నే అడిగితి

నిన్నే సత్యంగ కొలిచితి


అరిషడ్వర్గాలకు నిలువెత్తు నామరూపం నేనైతే...

నామరూపాలకు అతీతమైన ఓ నిరంతర సత్యం నీవు


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Monday, 3 January 2022

91 సాయినాథా!


షిరిడి పురవాస శ్రీ సాయినాథా.... 

జగమేలు మా తండ్రి సాయినాథా

బ్రతుకు చీకట్లను తొలగించు సాయినాథా.... 

వెలుగు రేఖల్ని నింపేవు సాయినాథా


ఈ వేళ ఆ వేళ ఏల సాయినాథా... 

అన్ని వేళలా మాతోటి ఉండు సాయినాథా      /షిరిడి పురవాస/


ఈ మాట ఆ మాట ఏల సాయినాథా... 

మా ప్రతి మాట నీ పాట కావాలి సాయినాథా    /షిరిడి పురవాస/


ఇచ్చోట అచ్చోట ఏల సాయినాథా... 

మా ఎద చోట కొలువుండు సాయినాథా    /షిరిడి పురవాస/


ఈ జన్మ ఆ జన్మ ఏల సాయినాధా... 

మా ప్రతి జన్మలోన వెంటుండు సాయినాథా... 

మము నడిపించు సాయినాథా...


షిరిడి పురవాస శ్రీ సాయినాథా.... 

జగమేలు మా తండ్రి సాయినాథా

బ్రతుకు చీకట్లను తొలగించు సాయినాథా.... 

వెలుగు రేఖల్ని నింపేవు సాయినాథా

షిరిడి పురవాస శ్రీ సాయినాథా.... 

జగమేలు మా తండ్రి సాయినాథా 


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ





Wednesday, 29 December 2021

90 సాయి చేయి

 


పశుపక్షులని ప్రేమించే చేయి

ప్రియ భక్తుల్ని లాలించే చేయి


వ్యాధిని మాయం చేసే చేయి

వ్యధలను దూరం చేసే చేయి


ఊదినిచ్చి ఆదుకొనే చేయి

ఊతమయ్యి వెంట నిలిచే చేయి


తీపి ముద్దులను అందించే చేయి

ప్రేమ ముద్దలను కొసరి తినిపించే చేయి


కష్టాల ఊబి నుండి బైటికి లాగే చేయి

కన్నీటి చారల్ని సైతం తుడిచేసే చేయి


సర్వము నీవే అంటే గుండెలకు హత్తుకొనే చేయి

సర్వస్య శరణాగతి అంటే నిలువెల్ల దీవెనలు కురిపించే చేయి

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

89 సాయి నీవే నేను

సాయీ.....

నేనన్న ఈ జన్మకి కారణం నీవే 
నేనన్న ఈ అస్తిత్వానికి ఋజువు నీవే

నేనన్న ఈ ప్రశ్నకు జవాబు నీవే 
నేనన్న ఈ సమస్యకు పరిష్కారము నీవే 

నేనన్న ఈ వ్యాధికి ఔషధం నీవే
నేనన్న ఈ భారానికి బాధ్యత నీవే

నేనన్న ఈ కవనానికి ప్రేరణ నీవే
నేనన్న ఈ కథకి కల్పన నీవే

నేనన్న ఈ జీవితానికి అర్థం నీవే
నేనన్న ఈ మాటకు పరమార్థం నీవే

నేనన్న ఈ దేహానికి ఆత్మవు నీవే
నేనన్న ఈ ఆత్మలోని పరమాత్మవు నీవే

నీవు రచించిన ఓ చిన్ని రచనే నా ఈ జీవితం
నేనన్న నీ ఈ రచనకు ముగింపూ నీదే

నీవే రచించిన నేనన్న ఈ రచనకు దిగులేల? 
మరి ఇక తిరుగేల?

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Thursday, 30 September 2021

88 సాయి పల్లకి

 


చూడరండి చక్కని మా సాయి పల్లకి

అది గంధ పరిమళాల పూలపల్లకి

 

ఎక్కినారు మా సాయి పూలపల్లకి 

అది పూల పూత పూసిన భక్తి పల్లకి


ఎత్తరండి మా సాయి భక్తి పల్లకి

అది భక్తి రేణువులద్దిన ప్రేమ పల్లకి


తిప్పరండి మా సాయి ప్రేమ పల్లకి

అది ఈ హృది నుండి ఆ హృదిలోనికి


తిప్పరండి మా సాయి హృది పల్లకి

అది ఈ భువి నుండి ఆ దివి లోనికి


చూడరండి మా సాయి చిరునవ్వుల పల్లకి

అది నవ్వులద్దిన ఆనందాల పల్లకి


చూడరండి చక్కని మా సాయి పల్లకి

అది ప్రేమ వాసనలద్దిన పూల పల్లకి 


పెట్టరండి గోరుముద్దల్ని మా చిన్ని సాయికి

తీయరండి దిష్టిని మా చక్కని సాయికి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ




Thursday, 16 September 2021

87 సాయి బాలసాయి

 

సాయీ...


తొలి సంధ్య వేళ బాల భానుని కాంతి నీది

మలి సంధ్య వేళ బాల చంద్రుని వెన్నెల నీది


తొలి పూజలందుకొనే బాల గణేశుని తత్వం నీది

అన్ని వేళలా కాపాడే బాలమురుగన్ మనసు నీది


పగటి వేళ  బాలరాముని తేజము నీది

రాత్రివేళ బాలకృష్ణుని అందము నీది


సర్వవేళలా బాల త్రిపురసుందరి శక్తి నీది

ఆర్తితో పిలిచిన వేళ బాల హనుమ రక్షణ నీది


సర్వకాల సర్వావస్థల యందు శరణాగతి చేసిన వారికి

సాయమందించే మా ముద్దుల బాలసాయివి నువ్వు


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Tuesday, 14 September 2021

86 సాయి దివ్య పాదము


సాయీ... 

వెతలను తీర్చే మహిమాన్వితమైన

నీ దివ్య పాదాలను నన్ను అంటనివ్వు


ఎద మాటున దాగిన వ్యధలన్నింటినీ కధలుగా 

నీ పాదాలకు చెప్పుకోనివ్వు


ఆనకట్ట కట్టి ఆపిన కన్నీళ్లను బయటకు తీసి 

నీ పాదాలను కడగనివ్వు


మధురాతి మధురమైన నీ పదముల అమృతాన్ని

ప్రియమారా తాగనివ్వు 


పరమ పవిత్రమైన నీ పాద ధూళిలో 

నన్ను మైమరచి ఆటలాడనివ్వు 


జ్ఞాన గంధముతో విరాజిల్లు నీ పాద పుష్పముల

మకరందాన్ని నన్ను మనసారా  గ్రోలనివ్వు


ఓం శ్రీ సాయిరాం 

🙏🙏🙏

-తేజ

85 సాయి వందనం

 

సాయీ...

ఇక్కడ కాదు, అక్కడ కాదు ఎన్నెన్ని మందిరాల్లో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఒకటి కాదు, రెండు కాదు ఎన్నెన్ని చిత్రపటాలలో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఇందు కాదు, అందు కాదు ఎందెందు విగ్రహాలలో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


ఒకటి కాదు, రెండు కాదు ఎన్నెన్ని ప్రాణుల్లో 

నీవు కొలువై ఉన్నావో అన్నింటికీ నా వందనం


వీరు కాదు, వారు కాదు ఎవరెవరి హృదయాలలో 

నీవు కొలువై ఉన్నావో వారందరికీ నా వందనం


నా ఆత్మలో కాదు, అంతరాత్మలో కాదు నా అణువణువునా

కొలువై ఉన్న నీకు నా ప్రేమ పూర్వక వందనం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Wednesday, 1 September 2021

84 సాయి హృది

 


సాయి బంధువులారా!

మన హృది పీఠం పై  సాయిని గురువుగ నిలపుదాం...

వారే మన జీవితానికి మార్గదర్శకమై నిలిచేను


మన హృది సింహాసనంపై సాయిని మహరాజుగ నిలపుదాం...

వారే మన ఇంద్రియాలను ఓడించేను


మన హృది భాండాగారంలో సాయిని అక్షయపాత్రగా నిలపుదాం...

వారే మనకి ఎన్నటికీ తరగని సంపదగా నిలిచేను


మన హృది మంజూషంలో సాయిని అమూల్య రత్నంగా నిలపుదాం...

వారే మన తరతరాలకు వారసత్వంగా నిలిచేను


మన హృది గదిలో సాయిని వైద్యునిగా నిలపుదాం...

వారే మన ఆది వ్యాధులకు చికిత్స చేసేను


మన హృది మందిరంలో సాయిని దైవంగా నిలపుదాం...

ఎనలేని ప్రేమను వారి నుండే వరంగా పొందుదాం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...