Wednesday, 21 April 2021

67 సాయి అమృతం

 


కరడుగట్టిన హృదిని శిల్పంగా మలిచేందుకు సాయినామమన్న ఉలి దొరికెనుగా

అజ్ఞానపు చీకట్లను చీల్చి జ్ఞాన జ్యోతులను వెలిగించేందుకు సాయిరాముడన్న మణి దొరికెనుగా

బరువెక్కిన గుండెల బాధ తీర్చేందుకు            సాయిగానమన్న ఔషదము దొరికెనుగా

శ్రద్ధ, సబూరీల కలశలను నింపేందుకు              సాయిలీలలన్న అమృతము మెండుగ ఉండెనుగా

భయమేల? చింతేల? ముందుకు నడిచేందుకు                సాయి నామస్మరణతో ఈ జగమే వెలుగుతుండెనుగా

ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

Tuesday, 20 April 2021

66 సాయి ఈ అలుకేల?


సాయీ....

విరివిగ అలరులు కురిపించు సాయీ 

మళ్ళీ ఈ అలుకేల మాపై?

మరువక మా కోర్కెలు మన్నించు సాయీ 

మళ్ళీ ఈ కినుకేల మాపై?


అడగకనే వరములు అందించే సాయీ 

ఈ అడుగుల ఎడమేల మాతో?

దయతో దరి చేర్చుకొనే సాయీ

ఈ దాగుడుమూతల ఆటేల మాతో?


క్షణమాగక కరమందించు సాయీ 

ఈ కోటి క్షణాల జాగేల మాకు?

చిరునవ్వుతో దర్శనమిచ్చు సాయీ

ఈ దోబూచుల శిక్షేల మాకు?


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Sunday, 18 April 2021

65 సాయి రావోయి

సాయీ....

రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి 

రవ్వంతైన ఆలసించక రావయ్య సాయి మా ఇంటికి

రావయ్య సాయి మా ఇంటికి 


పిలిచినంతనే పలికెదనంటివి

ప్రేమతో పిలిస్తే వేగిరమే వచ్చెదనంటివి

మరి రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి 


తలచినంతనే పక్కనే నిలిచెదనంటివి

ఇచ్చిన మాట ఎన్నడూ తప్పనంటివి

మరి రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి


కొలిచినంతనే కష్టాలను తీర్చెదనంటివి

మా కన్నీటిని తుడిచెదనింటివి

మరి రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి


నమ్మినంతనే వెన్నంటే నిలిచెదనంటివి

అమ్మవై ఆదుకుంటనంటివి

మరి రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి 


రావయ్య సాయి మా ఇంటికి 

రావయ్య సాయి మా ఇంటికి 

రవ్వంతైన ఆలసించక రావయ్య సాయి మా ఇంటికి

రావయ్య సాయి మా ఇంటికి 


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ






Friday, 16 April 2021

64 సాయి వచనాలు

 


బాబా...

అందరి దేవుడు ఒక్కడే అన్నావు

ప్రతి ఒక్కరి గుండెలో కొలువయ్యావు


శ్రద్ధ, సబూరి రెండే మార్గాలన్నావు

రెండు పైసల దక్షిణగా వాటిని కోరావు


మూడు రోజుల పాటు శ్వాసను నిలిపావు

ముక్కోటి దేవతల ప్రతిరూపమై నిలిచావు


నాలుగు చేతులతో నా బిడ్డల కాపాడెదనన్నావు

నాలుగు వేదాల సారాన్ని నీ చేతల్లో తెలిపావు


పంచ భూతాలను నీ అధీనంలో ఉంచావు

పంచేంద్రియాలను అదుపులో ఉంచమన్నావు


అరిషడ్వర్గాలను నీకే ఇమ్మన్నావు

షడ్రుచులను మించిన ప్రేమ రుచినే చూపావు


ఏడు రోజుల్లో నీ గ్రంథం చదవమన్నావు

ఏడేడు జన్మాల కర్మలు తొలగించెదనన్నావు


అష్టాంగ యోగాలను అవలీలగా చేశావు

అష్టకష్టాల నుండి మమ్మ రక్షించెదనన్నావు


నవవిధ భక్తికి ప్రతీకగా తొమ్మిది నాణాలిచ్ఛావు

నవ జీవన సరళికి నాంది పలికావు


పది మాటలకు ఒక్క మాట జవాబిమన్నావు

పది మందితో కలిసి మెలిసి ఉండాలన్నావు


పదకొండు నీ వచనాలందించావు

పరమ భక్తితో పాటించమన్నావు


సంఖ్యలలో తెలపలేనంత ప్రేమనే పంచావు

అసంఖ్యాకుల గుండెల్లో దైవమై నిలిచావు 


ఓం శ్రీ సాయిరాం 

🙏🙏🙏

-తేజ


Friday, 9 April 2021

63 సాయి గుణం

 


సాయీ...

కొందరిలా మనసుపెట్టి చేయలేను నీ పూజను  

మరికొందరిలా మైమరచీ చేయలేను నీ సేవను 


కొందరిలా భక్తితోటి చేయలేను నీ పూజను  

మరికొందరిలా ప్రేమతోటీ చేయలేను నీ సేవను 


కొందరిలా శ్రద్ధతోటి చేయలేను నీ పూజను 

మరికొందరిలా సబూరితోటీ చేయలేను నీ సేవను 


ధ్యానమే లేని పూజ నాది, 

ఓ యాంత్రిక పూజ నాది


లీనమే కాలేని పూజ నాది, 

ఓ తంతు పూజ నాది


ఐనా... చీదరించక, చీకాకు పడక ఆదరిస్తివి 

నన్నూ నీ బిడ్డనంటివి, నీ దరి చేర్చుకుంటివి


ఏంచేసి నేర్వగలను నీ గుణం

ఏమిచ్చినా తీర్చలేను నీ ఈ రుణం


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

62 సాయి పరమాత్మ


 సాయీ....


తీరూ తెన్నూలేక ఆత్మలందు ఘోషించే ఓ ఆత్మను తెస్తివి

దయతోటి ఈ దేహమిస్తివి, 

పేరిస్తివి, ఊరిస్తివి, ఉనికినిస్తివి

అంతటితో ఊరుకొంటివా, చల్లని నీ చేయిస్తివి

నీ పేరు తలిస్తే రక్షించెదనంటూ మాటిస్తివి

పిలిచిన వెంటనే పక్కనే నిలిస్తివి


చిగురుటాకులా వణికినప్పుడు చప్పున ఆదరిస్తివి

గుడిలో నీకు చేతులు జోడిస్తే నీ గుండెల్లో నాకు చోటిస్తివి


ఆశ వదులుకున్న ప్రతిసారి ఆత్మ విశ్వాసమై నిలిస్తివి

గుండె బరువెక్కిన ప్రతిసారి బతుకు తక్కెడలో మరోపక్క నిలిస్తివి


కన్నీటి చుక్కలను పన్నీటిగా మారిస్తివి

చుక్కల మధ్యలో చందురూని వోలే చక్కంగ నా గుండెలో నిలిస్తివి


ఇంత చేసిన నీకు నేనేమిస్తిని

పైనుండి ఈ నాలుగు అక్షరాల మాలిక తప్ప

లోనుండి నిరంతర నీ తలపుల మాలిక తప్ప


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

61 సాయి లేకుంటే

 


సాయీ........ 

నువ్వే కానీ లేకుంటే.....?

నువ్వే కానీ అవతరించకుంటే.......?

ఆ ఊహే నన్ను హరిస్తోంది

ఆ ధ్యాసే నన్ను దహిస్తోంది


చుక్కాని లేని నావల్లే

చుక్కలే లేని నభమల్లే  ఏమయ్యేను నా జీవితం


గమ్యం ఎరుగని పయనమల్లే 

గాలిలో పెట్టిన దీపమల్లే ఏమయ్యేను నా జీవనం


పొత్తిళ్ళలో దాచుకొనే తల్లే లేకుంటే

వేలు పట్టి నడిపించే తండ్రే లేకుంటే... ఏమయ్యేను నా జీవితం


అనుక్షణం ప్రేమను పంచే నీవే లేకుంటే...

క్షణక్షణం రక్షించే  నా బాబా లేకుంటే...ఏమయ్యేను నా జీవనం


నీవేకానీ లేకుంటే....?

నీవే కానీ మా కొరకు రాకుంటే...?

ఆ మాటకే కనులు కన్నీటి కొలనులౌతుంటే....

నువ్వు ఇప్పటికీ ఇంకా ఉన్నావన్న నీ ఉనికి ఒక్కటి చూస్తుంటే...

ఈ శ్వాస ఇంకా శ్వాసిస్తోంది

ఈ జీవి ఇంకా జీవిస్తోంది

నీ ప్రేమే నన్నిలా నడిపిస్తోంది


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Wednesday, 7 April 2021

60 సాయి మహిమ

 


మంచి ముత్యాల ఆభరణం వన్నె కోల్పోయె

మేలిమి బంగారు ఆభరణం వెలవెలపోయె

నా సాయి ధరించిన క్షమ అన్న ఆభరణం ముందర


పట్టు వస్త్రముల విలువ చిన్నబోయె

పూల దండలన్నీ మూగబోయె

నా సాయి ధరించిన దయ అన్న వస్త్రం ముందర


అగరు ధూపాల సువాసనలు గాలిలో కలిసిపోయె

అత్తరు ఘుమఘుమలు కూడా చిన్నబోయె

నా సాయి వెదజల్లే తీయని ప్రేమ ముందర


నేను నేనన్న అహంకారము చిన్నబోయె 

నాదినీదన్న ద్వంద్వము ఏకమైపోయె

నా సాయి చూపించే చల్లని చూపు ముందర


జన్మ జన్మల కర్మ ఫలం ఊడిపోయె

జననమరణ చక్రం ఇరుసు విరిగిపోయె

నా సాయి కురిపించే అవ్యాజ కరుణ ముందర 


ఓం శ్రీ సాయిరాం 

🙏🙏🙏

-తేజ






101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...