Monday, 3 May 2021

68 సాయి మనఃపూజ

 

సాయీ....

తొలిపొద్దు సమయాన రెప్ప తీస్తూనే 

నీ రూపాన్నే చూడాలంటూ

నా కనులకి మెల్లిగా నేర్పిస్తా

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


వేకువనే నీ రూపాన్ని చూస్తూనే 

నీ నామాన్ని పలకాలంటూ

నా పెదవులకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


ఘడియ ఘడియలో నిన్ను స్మరిస్తూనే 

సాటి జీవుల ఆకలి తీర్చమంటూ

నా కరములకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


తోటి వారికి సేవ చేస్తూనే 

నీ మందిరం వైపు అడుగేయమంటూ 

నా పదములకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నిత్యం నిన్ను పూజిస్తూనే చంచలమైన 

నా మనసుని నీ సన్నిధిలో పెట్టమంటూ

నా బుద్ధికి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నిత్యం నీ లీలా పఠనం చేస్తూనే 

అరిషడ్వర్గాలను అదుపులో పెట్టమంటూ 

నా అహంకారానికి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నీ స్మరణతో విరిసిన ఒక్కో అక్షర సుమాన్ని 

ఇలా జత చేస్తూ నీ మెడలో వేయమంటూ

నా చేతులకి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


శిక్షలన్నింటిని క్షమతో రద్దు చేయమంటూ 

నీ పాదాలను పట్టుకుని ప్రార్థిస్తా

మరి నా ఈ ఆత్మను నీకై నివేదిస్తా


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


No comments:

Post a Comment

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...