Tuesday, 22 June 2021

77 సాయి కన్నుల్లో

 


సాయీ... చూస్తున్నా నీ కన్నుల్లో....

ప్రేమ వెన్నెలను కురిపించే చల్లని చంద్రాన్ని

ఆద్యంతములు లేని ఓ కరుణా సంద్రాన్ని


సాయీ....చూస్తున్నా నీ మోములో...

ఆర్తుల కోసం నీవు పడే ఆవేదనని

బిడ్డల కోసం ఓ తల్లి పడే తపనని


సాయీ...చూస్తున్నా నీ చిరునవ్వులో...

జటిల సమస్యలకు సైతం మార్గాన్ని

మరెన్నో చిక్కు ప్రశ్నలకు జవాబుల్ని


సాయీ... చూస్తున్నా నీ సచ్చరిత్రలో...

అవధులు లేని నీ లీలాకాశాన్ని

అస్తమయం లేని ఓ సూరీడి ప్రకాశాన్ని


సాయీ... చూస్తున్నా నీ మార్గంలో...

అడుగడుగున నన్ను ఆదుకొంటున్న నీ హస్తాన్ని

అడగకనే నీవు నా చుట్టూ అల్లిన రక్షణ వలయాన్ని


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 21 June 2021

76 సాయి మాట

 

సాయీ....

ప్రేమతో పిలిస్తే పరిగెత్తుకుని వస్తానంటివి

ప్రేమకు ఆర్తిని జోడించి మరీ పిలుస్తున్నా సాయీ

పరుగిడ రావయ్య నను రక్షింపగ


నా నామాన్ని తలిస్తే సప్త సంద్రాలనైనా దాటిస్తానంటివి

నీ నామాన్ని పదేపదే తలుస్తున్నా సాయీ

వేగిరమే రావయ్య నన్నీ భవ సంద్రాన్ని దాటింపగ


నావైపు ఒక అడుగేస్తే నీవైపు పది అడుగులు వేస్తానంటివి

నీవైపు నే పరుగులే తీస్తున్నా సాయీ

వడివడిగా రావా నను నీ ఒడి చేర్చుకోవంగ


నన్ను శరణు కోరిన వారికి నేను సాయం చేస్తానంటివి

శరణు శరణంటూ నీకు శరణాగతే చేస్తున్నా సాయీ

చప్పున రావా నాకు సాయం అందివ్వగ


ఇచ్చిన మాటను ఎన్నటికీ పొల్లు పోనంటివి

రెప్పపాటు వేగంగ రావా సాయీ

పై నీ మాటలు నిజము చేయంగ


సర్వస్య శరణాగతి🙏


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 7 June 2021

75 సాయి మన్మందిరం

 

సాయీ...

ఇచ్చోట తిరిగాను, అచ్చోట తిరిగాను 

ఎచ్చటెచ్చటో తిరిగాను..ఓ మంచి జాగా నీకై వెతికాను

నీరుంది, నారుంది నీ కోసమింత ప్రేముంది

వేడుంది, వాయుంది నీ కోసమింత తలపుంది

దేహమన్న పేరుంది, మరి దాహమన్న వ్యాధీ ఉంది

కానీ జగమెరిగిన వైద్యుడివి నీవే వచ్చి ఉంటే ఇక వేరే దిగులేముంది??


ఇచ్చోట వెతికాను, అచ్చోట వెతికాను

మళ్ళీ ఈ దేహమంతా వెతికాను...ఓ మంచి గది నీకై వెతికాను

రెప్పల తలుపులున్న కన్నుల్లో అనుకొంటిని, 

కానీ ఆ కన్నీటితో తిప్పలు నీకేల?

రెక్కలల్లే ఉన్నా ఎగరలేని రెండు చేతుల గూటిలో అనుకొంటిని, 

కానీ చేజారిపోతే ఎలా?

అందుకే మందిరమంటి ఓ మనసు గదిని చూశా

అహమన్న తలుపులు తీసేశా, స్మరణన్న పీఠమేశా

శ్వాసన్న ధూపమేశా, వాక్కులన్న నైవేద్యం పరిచా


కానీ...

పేరుకు ఆత్మజ్యోతి ఉన్నా జ్ఞానజ్యోతిని వెలిగించాలి నువ్వే

పేరుకున్న జన్మజన్మాల ధూళిని తొలగించాలి నువ్వే

నిండైన నా మన్మందిరంలో శాశ్వతంగా ఉండిపోవాలి... 

నువ్వే..నువ్వే..నా నువ్వే


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Saturday, 5 June 2021

74 సాయీ మరువకు


సాయీ...

విడువకు విడువకు నన్నెప్పటికీ...

మరువకు మరువకు నన్నెటికి...


ఏ సెకనులోనో నేను విడిచానని, 

నువ్వు నా చేయి విడువకు పొరపాటునైనా, 

గట్టిగా పట్టి ఉంచు ఈ చేతిని ...ఈ జన్మ వరకే కాదు 

రాబోవు ఎన్నెన్ని జన్మల వరకైనా


ఏ ధ్యాసలోనో నేను నిన్ను మరిచానని, 

నువ్వు నన్ను మరువకు క్షణకాలమైనా,

గట్టిగా గుర్తు పెట్టుకో ఈ బిడ్డని...ఈ జన్మ వరకే కాదు 

రాబోవు ఎన్నెన్ని జన్మల వరకైనా


ఏ స్పృహలోనో విడిచేస్తే నేను ఈ జన్మను, 

నువ్వూ నన్ను విడిచేయకు అలా అలవోకగా,

గట్టిగా గుర్తుంచుకో ఈ మాటని...

"నీ స్పృహ లేని మరోజన్మ నాకెన్నటికీ వద్దని"


విడువకు విడువకు నన్నెప్పటికీ...

మరువకు మరువకు నన్నెటికి...

నా వంటి బిడ్డలు నీకు కోకొల్లలు ఉండొచ్చు కానీ... 

నీ వంటి తండ్రి నాకు నువ్వు ఒక్కడివే... 

నువ్వు ఒక్కడివే సాయీ....


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...