Sunday, 19 July 2020

39 సాయి తేజస్సు

బాబా...

మా శిరస్సు ఎల్లవేళలా నీ పాదాలపై ఉండనీ
నీ కరములు ఎల్లవేళలా మా శిరము పై ఉండనీ

మా మనస్సు ఎల్లవేళలా నీ వదనముపై ఉండనీ
నీ చూపులు ఎల్లవేళలా మా దేహాత్మలపై ఉండనీ

మా ఆలోచనలు ఎల్లవేళలా నీ వైపే సాగనీ
నీ ఆశీస్సులు ఎల్లవేళలా మా వెన్నంటే సాగని

మా తపస్సు ఎల్లవేళలా నీ కరుణ కోసం సాగనీ
నీ ఓజస్సు ఎల్లవేళలా రక్షణ కవచాలై మము చుట్టేయనీ

మా తమస్సు ఎల్లవేళలా నీ పాదాల చెంత తొలగనీ
నీ తేజస్సు ఎల్లవేళలా మాపై మెండుగా కురవనీ

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

38 సాయి సర్వాంతర్యామి

బాబా…

ఆదియు నీవే, అంతము నీవే
ఆది అంతముల నడుమ ఉన్నది నీవే, లేనిదీ నీవే
ఉండీ లేనట్టి సర్వమూ నీవే

సృష్టివి నీవే, లయవీ నీవే 
సృష్టి లయల నడుమ ఉన్న స్థితివీ నీవే, 
స్థితి కారుడవూ నీవే

ఉదయము నీవే, అస్తమయము నీవే
ఉదయాస్తమయముల నడుమ కదిలే మా ఎద లయవు నీవే
లయకారుడవూ నీవే

ఆత్మవు నీవే, అంతరాత్మవు నీవే
ఆత్మలను, అంతరాత్మలను సృష్టించిన పరమాత్మవు నీవే
సర్వాంతరాత్మవూ నీవే

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Thursday, 16 July 2020

37 సాయి నివేదన

బాబా...
ఇంత గొప్ప, అంత గొప్ప అన్న పేరు నాకొద్దు,
అశాశ్వతమైన ఈ లోకంలో
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ మంచి పేరు కావాలి
శాశ్వతమైన నీ దర్బార్లో

ఇంత మంచి, అంత మంచి అని నా గురించి
ఎప్పుడూ చెప్పను నీతో మాటల్లో
ఇంతైనా, ఎంతో కొంతైన నాలో ఎంత మంచి ఉందో
చెప్పగలవు నీవు తూకపు లెక్కల్లో

ఇంత చేసా, అంత చేసా అని నేను
ఎన్నడూ చెప్పుకోను ఎవ్వరికీ
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ మంచి చేయగలిగే
గీతనివ్వు ఈ చేతులకి

ఇంత ఇవ్వు, అంత ఇవ్వు అని నేను
కోరను నిన్ను ఎన్నటికీ
ఇంతైనా, ఎంతో కొంతైనా ఓ చోటు మాత్రం ఇవ్వు
నీ పాదాల చెంత ఎప్పటికీ

ఓం శ్రీ సాయిరాం 
🙏🙏🙏

-తేజ

Tuesday, 14 July 2020

36 సాయి పాదము



సాయి పాదము, అది భవ్య పాదము 2
నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము
సాయి పాదము, అది భవ్య పాదము 2

మాయను దాటించే మహోన్నత పాదము
జీవాత్మలను నడిపించే దివ్య పాదము

షిరిడీ పుణ్య భూమిని ముద్దాడిన పాదము 
గంగా యమునలు కొలువుండిన ధన్య పాదము

భక్తుల కోరికలు ఈడేర్చే అరుదైన పాదము
పుణ్య నదులు సైతము కోరే పరమ పుణ్య పాదము

అజ్ఞాన చీకట్లను తొలగించే అద్భుత పాదము
లెండీ వనములో విహరించిన వెలకట్టలేని పాదము

భవ జలధిని దాటించే భవ్యమైన పాదము
భక్తి లోకంలో విహరింప చేసే బంగారు పాదము

ప్రేమ మధువు ఉప్పొంగే స్వర్ణపద్మ పాదము
మోక్షమార్గమును చూపించే మహోన్నత పాదము

సాయి పాదము, అది భవ్య పాదము 2
నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము
సాయి పాదము, అది భవ్య పాదము 2

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Monday, 13 July 2020

35 సాయి తలపు


బాబా...ఓ…..బాబా
పలికే నా పెదవులే కాదు పలక లేని నా మది సైతం
నిరంతరం నిన్నే పిలవాలి 
నిరంతరం నిన్నే తలవాలి

బాబా...ఓ‌‌... బాబా
చూసే నా కన్నులే కాదు చూడలేని నా మది సైతం
నిరంతరం నిన్నే చూడాలి
నిరంతరం నిన్నే చేరాలి

బాబా...ఓ... బాబా
గడిచే ఈ క్షణమే కాదు గడవబోయే నా ప్రతీ క్షణం
నిరంతరం నీతో సాగాలి
నిరంతరం నిన్నే తలవాలి

బాబా...ఓ….బాబా
విరిసే ఆ కుసుమాలే కాదు విలువలేని నేను సైతము, 
విలువలేని నేను సైతము
నిరంతరం నిన్నే తాకాలి
నిరంతరం నీతో ఉండాలి

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Wednesday, 24 June 2020

34 సాయి చరణము


బాబా...

సుడిగుండాలంటి చిక్కుల వలయంలో
ఆకాశమంత ఎత్తయిన నమ్మకంతో
సంద్రమంత లోతైన ప్రేమతో
విశ్వమంత విశాలమైన భక్తితో
గది అంత ఇరుకైన మదిలో
నిలువెత్తు నీ రూప ధ్యానంతో

శూన్యమంటి నా ఒడిని నీ దయతో సంపూర్ణం చేయమంటూ
నీ పాదపద్మముల పై ఒక కన్నీటి బిందువునై నే వేడుకుంటున్నా...

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Monday, 22 June 2020

33 సాయి పురము

బాబా..

ఏ జ్యోతిష్య పండితుడిని నేను ఆశ్రయించను
జాతకాలను తిరగరాసే సాయిబ్రహ్మ
నా చెంతనే ఉండెనుగా

ఏ జాతి రత్నాన్ని నేను ధరించను
నవరత్నాలను తలదన్నే అమూల్యమైన సాయిరత్నం
నా చెంతనే ఉండెనుగా

ఏ ఇతర యోగులను నేను ఆశ్రయించను
యోగి రాజైన సాయి సద్గురువు
నా చెంతనే ఉండెనుగా

సాయీ మరి
ఏ వ్యధలకు, వ్యాధులకు చోటివ్వకు నా గుండెలో
నువ్వే స్థిరముగా కొలువుండిన నా ఈ సాయిపురములో

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Wednesday, 17 June 2020

32 సాయి ప్రేమ

బాబా...

నీ మాట ఎంత గొప్పది మా
ప్రతి బాటలో తోడుగా నిలుస్తున్నది

నీ కరుణ ఎంత గొప్పది
మమ్ము పదేపదే కాపాడుచున్నది

నీ ప్రేమ ఎంత గొప్పది
మమ్ము ప్రతీ క్షణం లాలిస్తున్నది

నీ క్షమ ఎంత గొప్పది
మమ్ము మనిషిగా తీర్చి దిద్దుతున్నది

నీ ఆశీస్సులు ఎంత గొప్పవి
నిరంతరం మాకు తోడుగా, నీడగా, రక్షగా నిలుస్తున్నవి

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Monday, 8 June 2020

31 సాయి సర్వాంతర్యామి


బాబా...
షిరిడీ లోనే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి ఈ ప్రకృతిలో పచ్చదనంగా ఉన్న నిన్నేమనాలి?

ప్రకృతిలోనే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి ఈ పశుపక్షుల్లో జీవాత్మగా ఉన్న నిన్నేమనాలి?

పశుపక్షుల్లోనే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి కరుణ నిండిన కొందరి గుండెల్లో ఉన్న నిన్నేమనాలి?

కరుణపూరిత గుండెల్లోనే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి నా రాతి గుండెలో సైతం బంధీగా ఉన్న నిన్నేమనాలి?

నా గుండెలోనే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి అన్ని ఆత్మలలో అంతరాత్మగా కొలువై ఉన్న నిన్నేమనాలి?

ఆత్మలలోని అంతరాత్మగానే నువ్వున్నావు అంటే నేను నమ్మేదెలా?
మరి ఆపదలో పిలిచిన ప్రతిసారి పలికే నిన్ను పరమాత్మ అని అనకుండా ఇంకేమనాలి?

ఆత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా కొలువైన నిన్ను సర్వాంతర్యామి అనక ఇంకేమనాలి?

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Monday, 1 June 2020

30 సాయి శరణము

బాబా...

కన్నులతో చూసా నీ రూపము
సాయి మనసుతో చేసా నీ ధ్యానము

పెదవులతో పలికా నీ నామము
సాయి మనసుతో చేసా నీ స్మరణము

వీనులతో విన్నా నీ కథనము
సాయి మనసుతో చూసా నీ గాధను

సుమములతో చేసా నీ పూజను
సాయి మనసుతో చేసా నీ సేవను

కరములతో కొలిచా నీ చరణము
సాయి మనసుతో కోరా నీ శరణము

ఇలా పదములలో తెలిపా నా ప్రేమను
సాయి మనసుతో చేరా నీ పాదము

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...