Sunday, 30 May 2021

73 సాయి చెంత

 


సాయీ...
నేను నేనులా ఎందుకిలా?
నిమిషమైనా నీ చెంత పెట్టలేని ఈ మనసుతో...

గంధమైనా, అత్తరైనా కాకుంటిని 
నిన్నే అంటి ఉండేందుకు
ముత్యమైనా, ఓ రత్నమైనా కాకుంటిని 
నీ మెడలో చేరేందుకు
దీపమైనా, ఓ ధూపమైనా కాకుంటిని 
నీ ముందు నిలిచేందుకు
మల్లెనైనా, ఓ మొల్లనైనా కాకుంటిని 
నీ పాదలనంటి ఉండేందుకు
ఛత్రమైనా, ఓ చామరమైన కాకుంటిని 
నీ సేవలో తరించేందుకు

సేవగ ఐనా, ఓ సాయంగ ఐనా మార్చమంటూ వేడుచుంటిని 
నీకు నచ్చేలా, నీవు మెచ్చేలా ఉండేందుకు
ఎప్పటికీ నీ చెంతనే నిలిచేందుకు

ఓం శ్రీ సాయిరాం
🙏🙏🙏

-తేజ

Thursday, 27 May 2021

72 సాయి వరం

 


సాయీ...

వెన్న వంటి నీ మనసుతో కొసరి కొసరి అందించేవు రెండు

ప్రేమ ఒకటి, కరుణ ఒకటి


వేదన నిండిన హృదయాలకు వెల్లువలా అందించేవు రెండు

దీవెనొకటి, ధైర్యమొకటి


నమ్మి కొలిచిన వారికి విరివిగా అందించేవు రెండు

ఆనందమొకటి, అనురాగమొకటి


నీ నామ స్మరణ చేసే వారికి తక్షణమే అందించేవు రెండు

రక్షణ ఒకటి, నీ వీక్షణ ఒకటి


నీ బిడ్డలందరికి గురుమంత్రాలు అందించేవు రెండు

శ్రద్ధ ఒకటి, సబూరి ఒకటి


బదులుగ కోరేవు రెండు

గర్వమన్న భిక్ష ఒకటి, క్రోధమన్న దక్షిణొకటి


బదులుగ మేమివ్వగలిగినవి రెండు

నీ స్మరణమొకటి, నీ స్ఫురణ ఒకటి


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Wednesday, 19 May 2021

71 సాయి ఆస్తి

 

బాబా...

నా ఆస్తి అంతా ఓ కౌపీనం, ఓ తంబిరేలు డొక్కు మాత్రమే అంటివి

అట్లైన నీ దగ్గరున్న 

అపారకరుణతో ఉప్పొంగే ఆ కృపానిధుల మాటేమి? 

ఆధ్యాత్మిక జ్ఞానముతో పొంగిపొర్లుతున్న ఖజానాల మాటేమి?


బంగారు కోటను తలదన్నే ద్వారకామాయి మాటేమి?

వెండి కొండకు తీసిపోని నీ మనసు మాటేమి?


దాచిపెట్టిన వరాల మూటల మాటేమి? 

దోచుకోలేని వజ్రాల వచనాల మాటేమి?


క్షమకాసులతో నిండిన నీ ధనాగారాల మాటేమి?

లెక్కలేనన్ని లీలల్ని తీసి చూపుతున్న నీ అక్షయపాత్ర మాటేమి?


తీయని ప్రేమతో నిండిన అమృతపు నిల్వల మాటేమి?

లోన నిన్నే నింపుకుని నడుస్తున్న ఎన్నో మనో"రధాల" మాటేమి?


ఇవన్నీ నీ ఆస్తులు కావా?

నీ బిడ్డలమైన మేము నీ ఈ అఖండ ఆస్తులకు వారసులము కామా?


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ


Tuesday, 18 May 2021

70 సాయి అండ

 


అడిగినదే తడవుగా అండగా నిలిచేను 

మా సాయి

అడిగినంతనే, అడుగైనా ఆలస్యం చేయక ఆదుకునేను 

మా సాయి

అడగనిదే పెట్టని అమ్మ లా కాకుండా,

అడగనప్పుడు కూడా అడుగుల సవ్వడే చెయ్యక అడుగడుగున ఆదుకునేను మా సాయి

అడిగినప్పుడు ఒకలా, మరి అడగనప్పుడు ఒకలా ఉండడు

మా సాయి

అడిగీఅడగని వాటిని సైతం అలవోకగా అందించేను 

మా సాయి

ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 3 May 2021

69 సాయి నీ పేరేమి?


సాయీ...

కరుణ నీ ఇంటి పేరా? 

ప్రేమ నీ మారుపేరా?

లేక ఓరిమి నీ ముద్దు పేరా?

లేకుంటే మాపై ఇంకనూ నీ దయకు కారణమేమి?


మా తప్పొప్పుల చిట్టాల చుట్టలు విప్పగా...

అన్నీ మా తప్పుల గుట్టలే


మాటిచ్చి మేమ తీర్చకుంటిమి, 

మరపుతో కొన్ని, మదముతో మరికొన్ని


నీ మాటల్ని మేము మీరమంటూనే తప్పుచుంటిమి

వాడుకలో కొన్ని, వగరుచు మరికొన్ని


మాటిమాటికి నీ శాసనాలు దాటుచుంటిమి

విషయ లోలత్వముతో కొన్ని, ప్రేమ లాలిత్యములో మరికొన్ని


విషయవాంఛలు ఓ చేయి పట్టి లాగుతుంటే

కర్మ బంధాలు మరో చేయి పట్టి లాగుతుంటే 

దిక్కు తోచక, దయ చూపమంటూ.. నీ ముందు మోకరిల్లుచుంటిమి

అయినా నీవు మాపై కరుణిస్తుంటివి


ఇప్పుడు చెప్పగలను ఖచ్చితంగా 

"క్షమే" నీ అసలు పేరని

మరి నన్నింత దగ్గరగా నీ గుండెల్లో పెట్టుకున్నావుగా

అందుకే నాకు బాగా తెలుసు 


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


68 సాయి మనఃపూజ

 

సాయీ....

తొలిపొద్దు సమయాన రెప్ప తీస్తూనే 

నీ రూపాన్నే చూడాలంటూ

నా కనులకి మెల్లిగా నేర్పిస్తా

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


వేకువనే నీ రూపాన్ని చూస్తూనే 

నీ నామాన్ని పలకాలంటూ

నా పెదవులకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


ఘడియ ఘడియలో నిన్ను స్మరిస్తూనే 

సాటి జీవుల ఆకలి తీర్చమంటూ

నా కరములకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


తోటి వారికి సేవ చేస్తూనే 

నీ మందిరం వైపు అడుగేయమంటూ 

నా పదములకు మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నిత్యం నిన్ను పూజిస్తూనే చంచలమైన 

నా మనసుని నీ సన్నిధిలో పెట్టమంటూ

నా బుద్ధికి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నిత్యం నీ లీలా పఠనం చేస్తూనే 

అరిషడ్వర్గాలను అదుపులో పెట్టమంటూ 

నా అహంకారానికి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


నీ స్మరణతో విరిసిన ఒక్కో అక్షర సుమాన్ని 

ఇలా జత చేస్తూ నీ మెడలో వేయమంటూ

నా చేతులకి మెల్లిగా నేర్పిస్తా 

నా మనసుని మెత్తగా శిక్షిస్తా


శిక్షలన్నింటిని క్షమతో రద్దు చేయమంటూ 

నీ పాదాలను పట్టుకుని ప్రార్థిస్తా

మరి నా ఈ ఆత్మను నీకై నివేదిస్తా


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ


101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...