Saturday, 28 August 2021

83 సాయి రేఖలు


వెలిగే భానుని ఉదయ రేఖల కాంతిలో నా సాయి అందం మెరిసే

వెలిగే దివ్వెల జ్యోతి రేఖల కాంతిలో నా సాయి అందం విరిసె

వెలిగే కర్పూర రేఖల కాంతిలో నా సాయి అందం వెల్లివిరిసే

వెలిగే సాయి రేఖల కాంతిలో నా మదిలో ప్రేమలు విరిసే

విరిసే నా ప్రేమ రేఖల కాంతిలో నా సాయి మరీమరీ మెరిసే....

ఆ మెరుపుల వెలుగులో నా డెందము మరింత మురిసిపోయే


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ

 

Thursday, 26 August 2021

82 సాయి హారము

 


రారండి రారండి సాయి భక్తులారా రారండి  

రారండి రారండి సాయి బిడ్డలారా రారండి


ఆణిముత్యమంటి మన సాయికి మేలిమి ముత్యాల హారమె‌ వేద్దాము

జాతిరత్నమంటి మన సాయికి నవరత్నాల హారమె వేద్దాము

రారండి॥


చంద్రుడంటి చల్లనైన సాయికి చంద్ర హారమె వేద్దాము

కరుణ కాసుల్ని కురిపించే సాయికి కాసుల‌ హారమె వేద్దాము

రారండి॥


వెన్న వంటి మనసున్న సాయికి వెండిపూల హారమె వేద్దాము

వర్ణభేదమెరుగని మన సాయికి సువర్ణ హారమె వేద్దాము

రారండి॥


వెన్నెల వెలుగులు చిమ్మే మన సాయికి వెన్నెల హారమె వేద్దాము

పూల మారాజైన మన సాయికి పూల హారమె వేద్దాము

రారండి॥


ప్రేమ మూర్తైన మన సాయికి ప్రేమలహారమె వేద్దాము

మనసెరిగిన మన సాయికి మన మనసుల హారమె వేద్దాము


రారండి రారండి సాయి భక్తులారా రారండి  

రారండి రారండి సాయి బిడ్డలారా రారండి


ఓం శ్రీ సాయిరాం 

🙏🙏🙏

-తేజ







Tuesday, 24 August 2021

81 సాయి ఉనికి

 


సాయీ...

సాయీశ జగదీశ జగదీశా

సాయీశ జగదీశ జయ జయ జగదీశా


లోకాలనేలేటి మా సాయీ

మా వెన్నంటే ఉంటూ మము కాపాడునోయి


నీ నామమెంతో మధురాతి మధురం 

అది మా పాపాల్ని తుడిచేటి మహా మంత్రం


నీ కరుణేమో మరి కురిసేటి వర్షం 

అది మా మలినాల్ని కడిగేటి పుణ్యతీర్థం


నీ స్మరణెంతో చేయాలి ప్రతి నిత్యం

అది మము కాపాడే అభయహస్తం


నీ మహిమెంతో తెలిపేది బహు కష్టం

అది మా కష్టాల్ని తొలగించును ఇది సత్యం


నీ ఉనికేమో తెలిసేను ప్రతి క్షణము

అది నింపేను మా గుండెల్లో విశ్వాసం


సాయీశ జగదీశ జగదీశా

సాయీశ జగదీశ జయ జయ జగదీశా


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ



Saturday, 14 August 2021

80 సాయి లాలిజో


లాలిజో లాలిజో మా సాయిజో సాయిజో

రామసాయి రామసాయి మా కృష్ణసాయి లాలిజో 

శేషసాయి శేషసాయి మా ప్రేమసాయి లాలిజో 

లాలిజో లాలిజో మా సాయిజో సాయిజో


లోకాలనేలి అలసిపోయిన మా తండ్రి సాయికి లాలిజో

ప్రేమల్ని పంచి సొలసిపోయిన మా తల్లి సాయికి లాలిజో

లాలిజో లాలిజో మా ప్రేమసాయికి లాలిజో

సాయిజో సాయిజో మా ప్రేమసాయికి సాయిజో


వెన్నముద్దలు ఆరగించిన మా కృష్ణసాయికి లాలిజో

ప్రేమముద్దలు పంచిపెట్టిన మా గురువు సాయికి లాలిజో

లాలిజో లాలిజో మా ప్రేమసాయికి లాలిజో

సాయిజో సాయిజో మా ప్రేమసాయికి సాయిజో


గోరుముద్దలు ఆరగించిన మా రామసాయికి లాలిజో

తీపిముద్దులు పంచిపెట్టిన మా దేవసాయికి లాలిజో

లాలిజో లాలిజో మా ప్రేమసాయికి లాలిజో

సాయిజో సాయిజో మా ప్రేమసాయికి సాయిజో


కరుణ వర్షం కురిపించిన మా దివ్యసాయికి లాలిజో

ప్రేమవర్షంలో తడిచిపోయిన మా భవ్యసాయికి లాలిజో

లాలిజో లాలిజో మా ప్రేమసాయికి లాలిజో

సాయిజో సాయిజో మా ప్రేమసాయికి సాయిజో


లీలలెన్నో చేసి అలిసిన మా బాబసాయికి లాలిజో

మహిమలెన్నో చూపి సొలసిన మా మధుర సాయికి లాలిజో

లాలిజో లాలిజో మా ప్రేమసాయికి లాలిజో

సాయిజో సాయిజో మా  ప్రేమసాయికి సాయిజో


లాలిజో లాలిజో మా సాయిజో సాయిజో

రామసాయి రామసాయి మా కృష్ణసాయి లాలిజో 

శేషసాయి శేషసాయి మా ప్రేమసాయి లాలిజో 

లాలిజో లాలిజో మా సాయిజో సాయిజో /2/


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ



Friday, 6 August 2021

79 సాయి పూలంగి సేవ

 


విరులెన్నో తెచ్చాను సాయీ నీ పాదాల చేర్చాను సాయీ

మాలల్ని తెచ్చాను సాయీ నీ మెడలోన వేశాను సాయీ

విరులెన్నో తెచ్చాను సాయీ నీ పాదాల చేర్చాను సాయీ


మరుమల్లెని తెచ్చాను సాయీ మాటల్ని నేర్పాను

విరజాజిని తెచ్చాను సాయీ జోలాలి నేర్పాను


సంపెంగని తెచ్చాను సాయీ గంధాన్నే తీశాను

మందారమె తెచ్చాను సాయీ మకరందమె తీశాను ‌‌‌‌

/విరులెన్నో/


పూబంతుల్ని తెచ్చాను సాయీ బాగూగ పెట్టాను

చేమంతుల్ని తెచ్చాను సాయీ నా చేతుల్తో చుట్టాను


కమలాల్ని తెచ్చాను సాయీ నీ శిరమున పెట్టాను

కలువల్ని తెచ్చాను సాయీ నీ ఒడిలోన చేర్చాను

/విరులెన్నో/


గన్నేరుని తెచ్చాను సాయీ పన్నీరులో ముంచాను

గులాబీని తెచ్చాను సాయీ గురువెవరో చూపాను


కదంబమే తెచ్చాను సాయీ నీ కంఠాన పెట్టాను

కనకాంబ్రమె తెచ్చాను సాయీ నీ కరములకు చుట్టాను

/విరులెన్నో/


పున్నాగ తెచ్చాను సాయీ సన్నాయిని నేర్పాను

రోజాల్ని తెచ్చాను సాయీ రాగాల్ని నేర్పాను


పూలతో నింపాను సాయీ నీకు పూలంగి సేవే చేశాను సాయీ

విరులెన్నో తెచ్చాను సాయీ నీ పాదాల చేర్చాను సాయీ


మాలల్ని తెచ్చాను సాయీ నీ మెడలోన వేశాను సాయీ

విరులెన్నో తెచ్చాను సాయీ నీ పాదాల చేర్చాను సాయీ


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ




Wednesday, 4 August 2021

78 సాయి మా సాయి

 


ఎవరయ్యా ఈ సాయి? ఏలాగ ఉంటాడు? /2/

మా వాడే ఈ సాయి..మా దేవుడీ సాయి

శశి లెక్క సల్లంగ ఉంటాడు మా సాయి


ఔనా! ఔనౌనా!

ఏ ఊరి వాడోయి? మరి ఏ సోటనుంటాడు?/2/

మా ఊరి వాడేనోయి..మా తోటే ఉంటాడు

గుళ్ళోనే కాదు మా సాయి, మా గుండెల్లోనుంటాడు


అలాగా! అలాగలాగా?

ఏమేమి సెప్తాడు మీ సాయి? మరి ఏటేటి సేత్తాడు?/2/

మంచేదో సెప్తాడు మా సాయి మాయల్ని తీత్తాడు

సిత్రాలే సేత్తాడు మా సాయి మరి సిరులెన్నో ఇత్తాడు


ఔనా! ఔనౌనా!

ఏమేమి తీత్తాడు మీ సాయి? ఏమేమి తీత్తాడు?/2/

కష్టాల్ని తీత్తాడు మా సాయి కర్మల్ని తీత్తాడు

బాధల్ని తీత్తాడు మా సాయి భారాల్ని తీత్తాడు


ఏమేమి ఇత్తాడు మీ సాయి? ఏమేమి ఇత్తాడు?/2/

కోరింది ఇత్తాడు మా రాజు మరి కోరందీ ఇత్తాడు

ప్రేమెంతో ఇత్తాడు మా సాయి ప్రాణంగా సూత్తాడు


మరి ఏమేమి అడుగేను మీ సాయి? ఏమేమి అడుగేను?

కాసింత ప్రేమా, కాసింత భక్తి...అడిగేను మా సాయి,

అడిగేను మా సాయి

ఓ పైసా శ్రద్ధా, ఓ పైసా సబూరి...అడిగేను మా సాయి,

అడిగేను మా సాయి


కమ్మంగా దొరికిండు మా సాయి కరుణానే ఇత్తాడు

వరమల్లే దొరికిండు మా సాయి వరాలే ఇత్తాడు

ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి /3/


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏

-తేజ





Tuesday, 22 June 2021

77 సాయి కన్నుల్లో

 


సాయీ... చూస్తున్నా నీ కన్నుల్లో....

ప్రేమ వెన్నెలను కురిపించే చల్లని చంద్రాన్ని

ఆద్యంతములు లేని ఓ కరుణా సంద్రాన్ని


సాయీ....చూస్తున్నా నీ మోములో...

ఆర్తుల కోసం నీవు పడే ఆవేదనని

బిడ్డల కోసం ఓ తల్లి పడే తపనని


సాయీ...చూస్తున్నా నీ చిరునవ్వులో...

జటిల సమస్యలకు సైతం మార్గాన్ని

మరెన్నో చిక్కు ప్రశ్నలకు జవాబుల్ని


సాయీ... చూస్తున్నా నీ సచ్చరిత్రలో...

అవధులు లేని నీ లీలాకాశాన్ని

అస్తమయం లేని ఓ సూరీడి ప్రకాశాన్ని


సాయీ... చూస్తున్నా నీ మార్గంలో...

అడుగడుగున నన్ను ఆదుకొంటున్న నీ హస్తాన్ని

అడగకనే నీవు నా చుట్టూ అల్లిన రక్షణ వలయాన్ని


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 21 June 2021

76 సాయి మాట

 

సాయీ....

ప్రేమతో పిలిస్తే పరిగెత్తుకుని వస్తానంటివి

ప్రేమకు ఆర్తిని జోడించి మరీ పిలుస్తున్నా సాయీ

పరుగిడ రావయ్య నను రక్షింపగ


నా నామాన్ని తలిస్తే సప్త సంద్రాలనైనా దాటిస్తానంటివి

నీ నామాన్ని పదేపదే తలుస్తున్నా సాయీ

వేగిరమే రావయ్య నన్నీ భవ సంద్రాన్ని దాటింపగ


నావైపు ఒక అడుగేస్తే నీవైపు పది అడుగులు వేస్తానంటివి

నీవైపు నే పరుగులే తీస్తున్నా సాయీ

వడివడిగా రావా నను నీ ఒడి చేర్చుకోవంగ


నన్ను శరణు కోరిన వారికి నేను సాయం చేస్తానంటివి

శరణు శరణంటూ నీకు శరణాగతే చేస్తున్నా సాయీ

చప్పున రావా నాకు సాయం అందివ్వగ


ఇచ్చిన మాటను ఎన్నటికీ పొల్లు పోనంటివి

రెప్పపాటు వేగంగ రావా సాయీ

పై నీ మాటలు నిజము చేయంగ


సర్వస్య శరణాగతి🙏


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Monday, 7 June 2021

75 సాయి మన్మందిరం

 

సాయీ...

ఇచ్చోట తిరిగాను, అచ్చోట తిరిగాను 

ఎచ్చటెచ్చటో తిరిగాను..ఓ మంచి జాగా నీకై వెతికాను

నీరుంది, నారుంది నీ కోసమింత ప్రేముంది

వేడుంది, వాయుంది నీ కోసమింత తలపుంది

దేహమన్న పేరుంది, మరి దాహమన్న వ్యాధీ ఉంది

కానీ జగమెరిగిన వైద్యుడివి నీవే వచ్చి ఉంటే ఇక వేరే దిగులేముంది??


ఇచ్చోట వెతికాను, అచ్చోట వెతికాను

మళ్ళీ ఈ దేహమంతా వెతికాను...ఓ మంచి గది నీకై వెతికాను

రెప్పల తలుపులున్న కన్నుల్లో అనుకొంటిని, 

కానీ ఆ కన్నీటితో తిప్పలు నీకేల?

రెక్కలల్లే ఉన్నా ఎగరలేని రెండు చేతుల గూటిలో అనుకొంటిని, 

కానీ చేజారిపోతే ఎలా?

అందుకే మందిరమంటి ఓ మనసు గదిని చూశా

అహమన్న తలుపులు తీసేశా, స్మరణన్న పీఠమేశా

శ్వాసన్న ధూపమేశా, వాక్కులన్న నైవేద్యం పరిచా


కానీ...

పేరుకు ఆత్మజ్యోతి ఉన్నా జ్ఞానజ్యోతిని వెలిగించాలి నువ్వే

పేరుకున్న జన్మజన్మాల ధూళిని తొలగించాలి నువ్వే

నిండైన నా మన్మందిరంలో శాశ్వతంగా ఉండిపోవాలి... 

నువ్వే..నువ్వే..నా నువ్వే


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

Saturday, 5 June 2021

74 సాయీ మరువకు


సాయీ...

విడువకు విడువకు నన్నెప్పటికీ...

మరువకు మరువకు నన్నెటికి...


ఏ సెకనులోనో నేను విడిచానని, 

నువ్వు నా చేయి విడువకు పొరపాటునైనా, 

గట్టిగా పట్టి ఉంచు ఈ చేతిని ...ఈ జన్మ వరకే కాదు 

రాబోవు ఎన్నెన్ని జన్మల వరకైనా


ఏ ధ్యాసలోనో నేను నిన్ను మరిచానని, 

నువ్వు నన్ను మరువకు క్షణకాలమైనా,

గట్టిగా గుర్తు పెట్టుకో ఈ బిడ్డని...ఈ జన్మ వరకే కాదు 

రాబోవు ఎన్నెన్ని జన్మల వరకైనా


ఏ స్పృహలోనో విడిచేస్తే నేను ఈ జన్మను, 

నువ్వూ నన్ను విడిచేయకు అలా అలవోకగా,

గట్టిగా గుర్తుంచుకో ఈ మాటని...

"నీ స్పృహ లేని మరోజన్మ నాకెన్నటికీ వద్దని"


విడువకు విడువకు నన్నెప్పటికీ...

మరువకు మరువకు నన్నెటికి...

నా వంటి బిడ్డలు నీకు కోకొల్లలు ఉండొచ్చు కానీ... 

నీ వంటి తండ్రి నాకు నువ్వు ఒక్కడివే... 

నువ్వు ఒక్కడివే సాయీ....


ఓం శ్రీ సాయిరాం

🙏🙏🙏


-తేజ

101 సాయి నన్ను విడువకు

  సాయి... నేను పలకరించడం లేదని నువ్వు నాతో మాట్లాడటం మానేయకు సాయి...నా ప్రతి మాట మాటలో నీవే నిండి ఉండోయి  నేను నిన్ను తలవడం లేదని నువ్వు నన్...